సృజనాత్మక వారధి.. సాహిత్య రథసారథి
(మా కథల స్వామికి ‘మనసు పూలదండ’)
గరిమెళ్ళ నాగేశ్వరరావు
డాక్టర్. లక్ష్మణ్ అయ్యర్ రామస్వామి, 1944వ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో 16వ తేదీన కేరళ రాష్ట్రంలో తిరుచ్చూరులో జన్మించారు. మాతృభాష తమిళం,
తను చదువుకుని విద్యాభ్యాసం కొనసాగించింది మలయాళం లో పట్టుబట్టి గట్టిగా
నేర్చుకుని కథలు కవితలు రాసి సాహితీవేత్తగా ఎదిగింది తెలుగులో. ఇలా బహుభాషా
పరిజ్ఞానంతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదుగుతూ, ముఖ్యంగా మలయాళం తెలుగు భాషల మధ్యన
దృఢమైన వారధిగా రెండు భాషల సాహిత్య సారధిగా ఎల్.ఆర్.స్వామి విశేషమైన పాత్రను
పోషించారు. సుమారు ఆరు దశాబ్దాల క్రితం ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో అడుగుపెట్టిన ఎల్.ఆర్.స్వామి,
అటు నగరవిస్తరణకు సమాంతరంగా తన సాహిత్య కృషిని విశాలం చేసుకుంటూ
“ఇంతింతై..వటుడింతై”, అన్నట్టు “సూఫీ చెప్పిన కథలు” అనే అనువాద రచనకు ప్రతిష్టాత్మక
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుచుకునే స్థాయికి చేరుకోగలడం నిజంగా
విశేషమే. సృజనాత్మకతకు ప్రాధాన్యత నిచ్చే ఎల్.ఆర్.స్వామి, అనువాద రచన పట్ల కొంత
విముఖత కలిగి ఉన్నట్లు చెప్పుకున్నారు. ఏదైనా తను స్వంతంగా రాయాలన్న పట్టుదలతోనే
తెలుగు భాషలోని సామెతలు నుడికారాల వంటి మూలాలలోకి వెళ్లి మరి తెలుగు నేర్చుకుని,
మంచి కథలు కవితలు రాసి పాఠకుల మన్ననలను బహుమతులను పొందగలిగారు. అయినా “గుడ్డొచ్చి
పిల్లని మింగినట్లు” తనలోని అనువాదకుడే పై చేయి సాధించినట్లు జరిగింది అంటారు.
1969లో ఆరణాల అచ్చ తెలుగు అమ్మాయి, శ్రీమతి
భట్టిప్రోలు నాగ సుంధరి గారు స్వామి గారిని ఇష్టపడి పట్టుబట్టి వివాహం చేసుకొని చేయిపట్టుకుని,
తెలుగు సంస్కృతిలోకి ఏడడుగులు నడిపించడం మరో విశేషం. శ్రీదేవి, శ్రీలత అనే ఇద్దరు కుమార్తెలతో,
గోపికృష్ణ, రాజగోపాల్ ఇరువురు అల్లుళ్ళతో స్వామి గారి కుటుంబం సంస్కృతుల
సమ్మేళనంగా విలసిల్లింది. విశాఖ సాహితీ సంస్థ అధ్యక్షులు అంగర కృష్ణారావు,
తెన్నేటి విశ్వనాథం వంటి ప్రముఖుల ప్రోత్సాహంతో తెలుగు భాష పట్ల మమకారాన్ని
పెంచుకోవడం, తన సహజ సిద్ధమైన జ్ఞాపక శక్తి వలన భాషను త్వరగా నేర్చుకోవడం జరిగింది.
మలయాళం లో తన మొదటి కవిత “ఆకలి” ప్రముఖ పత్రిక మాతృభూమిలో ప్రచురితమై ప్రశంసలు
పొందినది. అలాగే తెలుగులో తన తొలి కథ “జవాబులేని ప్రశ్న” కూడా బహుమతిని, పాఠకుల
ప్రశంసలని గెలుచుకోవడం జరిగి తన ఆసక్తి
మరింత పెరిగిందని అంటారు ఎల్ ఆర్ స్వామి. సాహిత్య అకాడమీ కోరికమేరకు మలయాళ జానపద
గీతాలను తెలుగులోకి అనువాదం చేస్తూ అనువాద రచనలకు శ్రీకారం చుట్టిన ఎల్లార్ స్వామి
ఆ తరువాత తెలుగు నుండి మలయాళం లోకి మలయాళం నుండి తెలుగులోకి తమిళం నుంచి
తెలుగులోకి సుమారు 70 పుస్తకాలను వెలువరించారు. ఇటీవల
తెలుగులో రెండు లక్షల కాపీలకు పైగా అమ్ముడుపోయిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీల’
పుస్తకాన్ని కూడా తను మలయాళం లోనికి అనువాదం చేసి సాహిత్యాభిమానుల మన్ననల్ని
పొందడం విశేషం.
ఫలితాలను ఆశించి ఎప్పుడు పని చేయొద్దని,
మంచి రచనలు చేస్తే పురస్కారాలు వాటి అంతటవే వచ్చి మరీ వరిస్తాయి అని చెప్పే ఎల్.ఆర్.స్వామి,
పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను పొందడం తన ప్రతిభాపాటవాలకి అద్దం పడుతుంది. రామన్ఉన్ని
మలయాళం లో రచించిన ‘సూఫీ చెప్పిన కథ’ను, తెలుగులో అనువదించి ఉత్తమ అనువాద రచయితగా
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, తమిళనాడు ప్రభుత్వ ‘నల్లి దిసై’ పురస్కారం, తమిళ
అసోసియేషన్ పురస్కారం, అక్షయ ఫౌండేషన్ పురస్కారం అక్షర గోదావరి పురస్కారం పరుచూరి
పురిపండా, బలివాడ కాంతారావు, కవి సంధ్య, కృష్ణా జిల్లా రచయతల సంఘం సంస్థల నుండి
పురస్కారాలను గీతం విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందడం ఎల్.ఆర్.స్వామి సాహిత్య
కృషికి దక్కిన గౌరవాలుగా చెప్పుకోవచ్చు. తెలుగు సామెతల ఆధారంగా కొన్ని ప్రత్యేకమైన కథలను
రాయడం, తెలుగు భాషని ఎంత లోతుగా అధ్యయనం చేశారో మనకి తెలియజేస్తుంది. ఎల్.ఆర్.స్వామి
రచనల పైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మల్లువలస కృష్ణ అనే విద్యార్థి పరిశోధన చేయగా ఆర్
భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని ఎం.ఫిల్ పట్టాను పొందడం రచనల సారాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రముఖ మలయాళ కవి,
కే.సచ్చిదానంద రాసిన 97 కవితలను ‘శరీరం ఒక నగరం’ పేరిట తెలుగులోకి అనువాదం చేసిన ఎల్.ఆర్.స్వామి,
కొండ దొరసాని, కథాకాశం, పాండవపురం, ముద్రలు, కథా దౌత్యం, బ్రహ్మర్షి శ్రీ నారాయణ
గురు, ఈ పురాతన కిన్నెర వంటి రచనలను మలయాళం నుండి తెలుగులోనికి అనువాదం చేశారు.
వీటితో పాటు ఆరోఆడపిల్ల, మనిషికి ఒక ముందుమాట. మలయాళ దళిత కథలు, 20వ శతాబ్దపు
ఇతిహాసం, ఎక్కడెక్కడో పడేసిన వస్తువులు వంటి విశిష్ట రచనలను కూడా అనువాదం చేయడం
స్వామి ప్రతిభకు తార్కాణం. ఆటవికరాజ్యం కథా సంపుటి. అర్ధనారీశ్వరుడు నవలలను తమిళం
నుండి తెలుగులోకి అనువదించారు. ప్రముఖ తెలుగు కవులు ఎన్. గోపి, శివారెడ్డి రచనలని,
గురజాడ అప్పారావు కథలు. శ్రీశ్రీ
మోనోగ్రాఫ్, సలీం, జయంతి పాపారావు, చాగంటి సోమయాజులు, కేతు విశ్వనాథరెడ్డి వంటి
ప్రముఖుల రచనలను తెలుగు నుండి మలయాళం లోనికి అనువదించి రెండు భాష సంస్కృతుల మధ్యన
పాఠకుల మదిలో అక్షరాల వారధిగా నిలచిపోయారు ఎల్.ఆర్.స్వామి. తెలుగులో తను
వెలువరించిన స్వీయ రచనలు కథాస్వామ్యం, గోదావరి స్టేషన్, సామెత కథలు, కథాకాశం, అలగా..
అలగా, లోగుట్టు పెరుమాళ్ళకెరుక వంటి రచనలలో వస్తు వైవిధ్యం విభిన్న శైలి, శిల్పం పాఠకులని
ఆకట్టుకుంటాయి. మానవ సంబంధాల పట్ల పరిపూర్ణమైన ప్రేమ, సామాజిక స్పృహ సంస్కారవంతమైన
సందేశం, వాస్తవికతకు దగ్గరగా ఉండే కథా అంశం ఎల్లార్ స్వామి ప్రత్యేకతలుగా
గోచరిస్తాయి. కథారచయిత గానే కాకుండా కవిగా కూడా అనేక కవితలు వివిధ పత్రికలలో
అచ్చవడం, బహుమతులు ప్రశంసలు పొందడం, ‘కవితా వార్షిక’ వంటి ప్రముఖ పత్రికలలో చోటు
చేసుకోవడం ఎల్.ఆర్.స్వామి బహుముఖ ప్రజ్ఞా పాటవాలను తెలియజేస్తాయి. తనది కవిహృదయమేనని,
అందుకనే తన కథలలో సైతం కవితాత్మక శైలి కనబడుతుంది అంటారు స్వామి. తన రచనల ద్వారానే
కాకుండా ప్రత్యక్ష భాగస్వామ్యంతో సాహిత్య సమావేశాలలో అనేక విశిష్టమైన, విలక్షణమైన,
వినూత్నమైన ప్రయోగాలతో, నూతన ఆలోచనలతో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించిన ప్రతిభాశాలి
ఎల్.ఆర్.స్వామి.
సహృదయ సాహితీ సంస్థ అధ్యక్షునిగా, మొజాయిక్
సాహిత్య సంస్థ గౌరవ అధ్యక్షుడిగా, అసంఖ్యాక సాహితీ సభలకు అధ్యక్ష స్థానాన్ని
అలంకరించిన ప్రత్యేక గౌరవం దక్కింది స్వామి గారికి. ‘కథాకచేరి’ పేరిట నూతన
రచయితలను ప్రోత్సహిస్తూ మంచి కథలకు బహుమతులనిస్తూ, ఎల్.ఆర్.స్వామి ప్రారంభించిన
కార్యక్రమం ఉత్తమ ఫలితాలని అందించి, అనేకమంది కథారచయితలను విజయవంతంగా తీర్చిదిద్దగలిగింది.
ప్రముఖ సాహితీవేత్తలు రామతీర్థ, జగద్దాత్రులతో, రక్తసంబంధం కంటే గొప్పదైన అక్షరాల
అనుబంధం తనది, అని ఆత్మీయంగా చెప్పుకునే ఎల్.ఆర్.స్వామి మొజాయిక్ సాహిత్య సంస్థ
ద్వారా వారితో కలిసి నిర్వహించిన అనేక
కార్యక్రమాలు విశాఖ సాహిత్య చరిత్రలో మేలైన మైలురాళ్లుగా నిలిచిపోతాయ అనడం
అతిశయోక్తి కాదు. శ్రీ శ్రీ శతజయంతి సభ, శ్రీ శ్రీ ప్రసంగధార, మహాప్రస్థానంశ్రవ్యరూపకం,
యానిమేటెడ్ మహాప్రస్థానం దృశ్యరూపకం, శిరస్సు చెప్పిన రహస్యం నాటక ప్రదర్శన,
కన్యాశుల్కం కవితోత్సవం, జండాపై కవిరాజు, వంటి కార్యక్రమాలలో రాష్ట్రం నలుమూలల
నుండి విశిష్ట సాహితీవేత్తలను ఆహ్వానించి నిర్వహించిన కార్యక్రమాలు సాహితీవేత్తల
మదిలో అజరామరంగా నిలచిపోతాయి. ఆంధ్ర విశ్వ కళాపరిషత్, మొజాయిక్ సంస్థలు సంయుక్తంగా
నిర్వహించిన కందుకూరి వీరేశలింగం
శతవర్ధంతి సమారోపణ కార్యక్రమంలో మాననీయ గౌరవ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గారి
సమక్షంలో పాల్గొనే అవకాశం ఎల్.ఆర్.స్వామి కీదక్కిన
అరుదైన గౌరవాలలో ఒకటి. ప్రముఖ వారపత్రిక ‘నవ్య’
నిర్వహించిన 100 విశిష్ట కథలు 100 విశిష్ట కధకులు శీర్షికలో 96వ కథగా ఎల్ఆర్
స్వామి రచన ‘అరణ్యరోధన’ ఎంపికై ప్రచురించబడడం మరొక గౌరవం. వాస్తవికతతో పాటు కొంత
కాల్పనికతను, సృజనాత్మకంగా జోడించి కథను రూపొందించినప్పుడు అది పాఠకుల మనసులోకి
సూటిగా చేరుతుందని విశ్వసించే స్వామి తను రచించిన ‘పుల్లమామిడి’ కథ చదివి ‘మా
ఇంట్లో ఇలాగే జరిగిందంటూ’ పాఠకులు తమ సంతోషాన్ని పంచుకోవడం తను ఎప్పటికీ
మరిచిపోలేని సంఘటన అని చెబుతారు. జనన మరణాలు కవల పిల్లలుగా భావిస్తూ తను రాసిన ఒక
కవితను, ఈ సందర్భంగా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. “మేము కవల పిల్లలం/ నేను పుట్టిన
క్షణమే వాడు పుట్టాడు/ కాదు.. కాదు వాడిని వెనకకు నెట్టి పుట్టాను నేను/
అప్పటినుండి మొదలైంది పరుగు పందెం/ ఒకరినొకరు ఓడించాలని/ నాకు తెలుసు ఏదో ఒక రోజు
నేనే లొంగిపోతానని/ ఎంతైనా నా బుజ్జి తమ్ముడు కదా వాడు/ నేను జీవితం/ వాడు మరణం”.
ఈ కవితలో స్వామి చెప్పినట్టు తన బుజ్జి తమ్ముడికి లొంగిపోతూ అప్రతిహత అక్షర ప్రవాహాన్ని,
అనంత కాలచక్రంలోకి అంతర్లీనం..చేస్తూ అక్షరాల ఆకాశంలో ధృవ తారలా వెలిగేందుకు, తను
సెలవు తీసుకుని తనువు చాలించి 25 ఏప్రిల్ 26 న, మనల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆఖరి
క్షణం వరకు సాగిన ఆ నిర్విరామ సాహిత్య
కృషి, రెండు భాషల మధ్యన.. రెండు సంస్కృతుల మధ్యన చెక్కుచెదరని ఉక్కు వారధిలా,
తరతరాలకి నిలచిపోతుంది. స్ఫూర్తి పొందిన సాహితీవేత్తల పయనం అక్షర దీపాలు పట్టుకు ఆగకుండా అలా ముందుకు
సాగుతూనే ఉంటుంది.

No comments:
Post a Comment