Friday, August 2, 2013

ప్రియమైన శత్రువు

ప్రియమైన శత్రువు

  • 21/07/2013
  • |
  • -గరిమెళ్ల నాగేశ్వరరావు
కోపం.. అతడికి శాపం
అహం.. వెంటాడుతూంటుంది.. పాపం
నన్ను చూసిన ప్రతిసారీ...
అతడి గుండెల్లో.. నా మిత్రుడికీ.. శత్రువుకీ మధ్య
జరుగుతూంటుంది యుద్ధం
అసూయ రగిల్చిన అకారణ ద్వేషమేదో
పుట్టెడు దుఃఖాన్ని రాసిచ్చింది తనకి
అతడు నాలా ఉండాలని కలకంటున్నాడట
లేదా నేను తనలా మారాలనుకొంటాడట
నేను గెలిచిన ప్రతిసారీ.. అతడు
అసూయ చేతిలో ఓడిపోతుంటాడు
నేను నవ్వినప్పుడు.. అతడి కళ్లల్లో కసి తడిసిన సవ్వడి
నన్ను నిందించడానికి.. తను మనసంతా
గాయాల పాలౌతూంటాడు.
తప్పులని వెదుకుతూ.. దారి తప్పిపోతూంటాడు
పెరిగిపోయే నిస్పృహలో.. అంతరంగం
అంటుకున్న వాసన..
మనసుని మభ్యపెట్టలేక..
నాలుక మీంచి జారిపోతోన్న అసహనం.
ఓటమిని గెలుపనుకొంటూ..
ద్వేషాన్ని ప్రేమిస్తోన్న అమాయక మిత్రుడతను.
తన హెచ్చరికలతో నాకు మాత్రం..
అప్రమత్తత నేర్పిన ప్రియమైన శత్రువు
ఏదో ఒకరోజు నా ప్రేమలో పడి కొట్టుకుపోతాడు
తిరిగి మిత్రుడై.. స్నేహ తీరంలోంచి కళ్లు తెరచి చూస్తాడు.
*

No comments: