Wednesday, November 14, 2012

during a programme in a school

speaking at vislandra book festival


ugadi vasantotsavam -port stadium march 2012

Minister Sri Ghanta Srinivasa Rao, MLAs, Collector sri luv agarval Sri Madugula Nagaphani sarma

పబ్లిక్ రొమాన్స్’.. పరులకు న్యూసెన్స్! - గరిమెళ్ల నాగేశ్వరరావు 08/11/2012 andhrabhoomi bhumika





తగరపువలస నుంచి విశాఖ నగరం వైపు దూసుకెళుతోంది ఓ ‘షేరింగ్ ఆటో’.. చేయి చూపి ఆపమన్నాను.. కీచుమనే శబ్దంతో ఆటో ఆగింది.. అప్పటికే అందులో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఒక ఆడ, ఒక మగ ఉండగా, మూడోవ్యక్తిగా నేను ఎక్కిన తర్వాత ఆటో బయలుదేరింది. లోపల కూర్చున్న ఆ ఇద్దరూ ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేనట్లు సరసాల్లో మునిగిపోయారు. ‘జగతిన ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకుపోతుంటే’- అనే సినిమా పాటలా ఆ అమ్మాయి, అబ్బాయి మధ్య జోరుగా సాగుతోంది వ్యవహారం. పక్కనే కూర్చున్న నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. ఆటోడ్రైవర్ మాత్రం అప్పుడప్పుడు అద్దంలో వాళ్లిద్దరి చేష్టలను చూస్తున్నాడు. ఆటో వెళ్తుండగా మరో ఇద్దరు ఎక్కారు. వెనకాల సీట్లపై ఇంకో ఇద్దరు చేరారు. ఆటో ‘హౌస్‌ఫుల్’ అయినా ఆ యువజంటకు మాత్రం ఇవేమీ పట్టలేదు. కిక్కిరిసిన ఆటోలో వారి సరసం నాన్‌స్టాప్‌గానే సాగుతోంది. ఆటలో సాటి ప్రయాణికులు ఉన్నారని గానీ, ఎవరో ఒకరు తమను గమనిస్తుంటారని గానీ వాళ్లకు ఏ మాత్రం బెదురు లేదు. ఇది వయసు తప్పా? వారి పెంపకంలో లోపమా?
* * *
నగర శివారులో అదో ఎటిఎం సెంటర్. అర్జంటుగా డబ్బులు విత్‌డ్రా చేయాలని ఎటిఎం వద్ద మెట్లు ఎక్కబోతుండగా అక్కడి సెక్యూరిటీ గార్డు వచ్చి, ‘సార్.. ఇది అవుట్ ఆఫ్ సర్వీస్, ఇంకొంచెం ముందుకు వెళితే మరో ఎటిఎం ఉంది..’అని చావుకబురు చల్లగా చెప్పాడు. ‘సరే ఇక చేసేదేముంది’ అని వెనుదిరిగి వెళుతుండగా ఓ యువజంట ఎటిఎం నుంచి బయటకు వస్తూ నా కంటపడింది. వారు సెక్యూరిటీ గార్డు చేతిలో వందనోటు పెట్టి ‘్థ్యంక్స్’ చెప్పి వెళ్లిపోగా ఆశ్చర్యపోవడం నావంతయ్యింది.
ఈ మధ్య పత్రికల్లో, టీవీ చానళ్లలో ఇలాంటి వార్తలు వచ్చాక అవన్నీ నిజమేనని బోధపడింది. ఎటిఎం పనిచేయడం లేదని అబద్ధం చెప్పిన సెక్యూరిటీ గార్డును గట్టిగా నిలదీశాను. తాను చేసింది తప్పేనని, మరోసారి ఇలాంటి పాడుపని చేయనంటూ ఆ గార్డు కాళ్లావేళ్లా పడి ప్రాథేయపడ్డాడు.
ఎటిఎం సెంటర్లలో ఇలా కొందరు యువతీ యువకులు కావల్సినంతసేపు ఏకాంతంగా ఉంటూ సరసాలాడుకోవడం, తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోవడం.. ఇదేం సంస్కృతి? ఇదెక్కడి సభ్యత? ఈ నాగరిక ప్రపంచంలో నైతిక విలువలకు స్థానం ఎక్కడ? విచక్షణ కోల్పోయి నేటి యువత ఎటు వైపు వెళుతోంది?
ఉదయం ఎనిమిది గంటల వేళ.. విశాఖ శివారులోని కంబాలకొండ పక్కన హైవేపై వెళుతుంటే.. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ అమ్మాయి, అబ్బాయి భుజాలకు పుస్తకాల బ్యాగులు తగిలించుకుని కొండపైకి పోతున్న దృశ్యం కనిపించింది. పాఠశాలకు గైర్హాజరై, ఏకాంతం కోరుకుంటూ వారు ఎందుకు పోతున్నారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. యవ్వనంలోకి ఇంకా అడుగుపెట్టని వీరు ఏకాంతం కోసం వెళ్లడం ఏమిటి? తమను చాలామంది చూస్తున్నారని తెలిసినా వీరు పట్టనట్లు వ్యవహరించడం చూస్తుంటే ఏమనాలి?
బీచ్ ఒడ్డున, పార్కుల్లో, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్‌లో, రెస్టారెంట్లలో ఎక్కడ పడితే అక్కడ ఇవే దృశ్యాలు. దీన్ని ప్రేమంటారా? స్నేహమంటారా? శృంగారమంటారా? ఎంజాయ్‌మెంట్ అంటారా? ఏ పేరు పెట్టుకున్నా నేడు ఇవి సర్వసాధారణమయ్యాయి. ఈ దృశ్యాలను చూసి, పిల్లాపాపలతో పార్కులకు రావడానికి సంసారులు సంశయిస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్లకు తెలియక పోవడం వల్లో, తెలిసినా పట్టించుకోనందునో ‘ప్రేమపక్షుల’ సరస సల్లాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. మానసిక అపరిపక్వత, తెలిసీ తెలియని వయసులో కొందరు విద్యార్థులు ఇలా ఏకాంతం కోరుకుంటూ సరదాలతో కాలక్షేపం చేస్తున్నారు. వీటి కొనసాగింపు విషాదాంతమై, నేరాలతోనో, ఘోరాలతోనే ముగిస్తే కన్నవాళ్లకు కన్నీళ్లు తప్ప ఏం మిగులుతాయి?
సైబర్ కేఫ్‌ల్లో చాటుమాటుగా సాగే సరస శృంగార దృశ్యాలు రహస్య కెమెరాలకు చిక్కడం, ఆ తర్వాత అవి ‘ఇంటర్నెట్’లో వీర విహారం చేయడం నేడు జరుగుతున్న చరిత్రే. సెల్‌ఫోన్లలో అమ్మాయిల్ని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వారిని ‘బ్లాక్‌మెయిల్’ చేసే ఆకతాయి యువకుల గురించి తరచూ ఎన్నో కథనాలు వింటూనే ఉన్నాం. ఇలాంటి విషయాల్లో కొందరు అమ్మాయిలు సైతం పాల్గొనడం చూస్తుంటే ఒక్కోసారి విస్మయం కలుగుతుంది. ఓ కళాశాల హాస్టల్‌లో డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయి తన స్నేహితురాళ్లు స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో రహస్యంగా చిత్రీకరించి, ఆ నగ్నదృశ్యాలను తన బోయ్‌ఫ్రెండ్‌కు కానుకగా ఇస్తూ పట్టుబడిన సంఘటనలు వంటివి వెలుగులోకి వస్తున్నాయి.
ఆకర్షణగా మొదలై ప్రేమ పేరుతో సాగే ఈ ‘రొమాన్స్’లో ఎక్కువగా బలైపోయేది అమ్మాయిలే. వంచన గ్రహించి వారు తిరగబడితే యాసిడ్ దాడులు, గొంతు కోయడాలు వంటివి మనం చూస్తూనే ఉన్నాం. యవ్వనంలో ఏం చేసినా యువతకు కరక్టుగానే ఉంటుంది. తప్పని చెబితే అంగీకరించేందుకు వారు మానసికంగా సిద్ధంగా ఉండరు. స్నేహం, ప్రేమ, కామం, అనుబంధం, అవసరం, అవకాశవాదం.. వీటి మధ్య ఉండే వైరుధ్యాలను యువత అర్థం చేసుకోవాలి. సరదాలు, సరసాలు, సభ్యత వంటి పదాలకు అర్థాలను తెలుసుకుని అందుకు తగ్గట్లుగా మెలగాలి. ఎవరినీ పట్టించుకోకపోవడం, తమకేమీ కాదన్న అహంకారం వంటి భావజాలాన్ని విడనాడాలి. వినోదానికి, విచ్చలవిడి తనానికి తేడా గ్రహించాలి. చదువుకన్నా, ఎంజాయ్‌మెంట్ కన్నా వ్యక్తిత్వం ప్రధానమని తెలుసుకుంటేనే వారి జీవితాలకు సార్థకత చేకూరుతుంది.