

పూర్వం కావ్యనాథుడు అనే కవి ఉండేవాడు. అతడి ప్రతిభను కొనియాడుతూ అనేకమంది పండితులు, రాజులు సత్కారాలు చేయడంతో క్రమేపీ అతడిలో అహంకారం పెరిగిపోయింది. తనంతవాడు మరెవ్వడూ లేడన్న భావంతో విర్రవీగుతూ, ఇతర పండితులను తూలనాడడం, వీలుదొరికినప్పుడల్లా వారిని అవమానించడం చేసేవాడు. కావ్యనాథుడితో సమానంగా ప్రతిభగలిగిన మరో పండితుడు విద్యానాథుడు. అతడు వినయశీలి. కావ్యనాథుడి అహంకారాన్ని గమనించిన విద్యానాథుడు సమయం దొరికినప్పుడు తగిన రీతిలో బుద్ధిచెప్పాలనుకున్నాడు.
ఒక రోజు కావ్యనాథుడి నూతన కావ్యం ఆవిష్కరణ రాజసభలో ఘనంగా జరుగుతోంది. ఆ కావ్యంలోని విశేషాలను, గుణగణాలను పండితులంతా పొగుడుతూంటే ఉబ్బి తబ్బిబ్బయ్యిన అతడు ‘‘మహారాజా... ఈ పండితులంతా గమనించలేదు గానీ ఈ కావ్యంలో ఆరంభంలోనే, నేనొక ప్రయోగం చేశాను. ఎవరైనా తమ కావ్యాన్ని ‘శ్రీ’కారంతో ప్రారంభించడం ఆనవాయితీ. కానీ నేను మాత్రం ఈ కావ్యాన్ని ‘‘అ’’కారంతో ఆరంభించాను. అకారం- మకారంతో కలిసినప్పుడు అమ్మగా మారి అంతులేని ప్రేమని అందిస్తుంది. అంతేకాదు, అకారం అమరత్వానికి ప్రతీక, ఈ కావ్యగానం అమృత పానంతో సమానమని నా భావన. ముందుముందు పండితులంతా... నా మార్గంలోనే నడుస్తారు’’-అన్నాడు.
సభ హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. ఇదే సరైన సమయం అనుకున్న విద్యానాథుడు ‘‘మహారాజా... మీరు మన్నిస్తే నాకు చిన్న అభ్యంతరం ఉంది’’ అన్నాడు వినమ్రంగా లేచి నిలుచొని.
‘‘నా కాలి గోటికి సరిపోని పండితుడివి... నీకు అభ్యంతరమా...?’’ అన్నాడు గర్వంతో విర్రవీగుతూ కావ్యనాథుడు.
‘‘నా సందేహాలను తొలగించడంవలన మీ ప్రతిష్ట మరింత పెరగవచ్చు కదా?’’ అంటూ బదులిచ్చాడు విద్యానాథుడు.
‘‘ఇంతకీ మీ అభ్యంతరమేంటో చెప్పండి’’ అన్నాడు మహారాజు మధ్యలో కలుగజేసుకొని.
‘‘మహారాజా.. అకారం- అమ్మ తనానికీ, అమరత్వానికీ ప్రతీక అనడం బాగానే ఉంది.. కానీ అకారానికో విలక్షణమైన గుణం ఉన్నది అది కొన్ని కొన్ని మంచి గుణాలని చెడ్డగా మార్చేస్తుంది. సత్యం, ధర్మం, న్యాయం, క్రమం, నీతి వంటి సుగుణాలన్నీ అకారంతో కూడగానే అసత్యం, అధర్మం, అన్యాయం వంటి దుర్గుణాలుగా మారిపోతాయి. అలాగనే ఇంత మంచి కావ్యాన్ని, సకల శుభాలనీ చేకూర్చే శ్రీకారంతో కాకుండా అకారంతో ఆరంభించడం అహంభావంగా అనిపిస్తుంది. అకారం అజ్ఞానానికీ, అంధకారానికీ, అసురత్వానికీ కూడా ప్రతీక అన్న సంగతి పండితులవారు మరచిపోయినట్టున్నారు. ఎంత ప్రతిభగల పండితుడైనా విజ్ఞత, వినయం లోపించినపుడు నాగమణిని తలలో ధరించిన పాముతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి కదా’’ అన్నాడు విద్యానాథుడు. సభలోని వారందరూ ఈ వాదనకు ఆమోదం తెలుపుతున్నట్లు పెద్దపెట్టున కరతాళ ధ్వనులు చేశారు.
తన తప్పు తెలుసుకున్న కావ్యనాథుడు పశ్చాత్తాపంతో విద్యానాథుడికి పాదాభివందనం చేస్తూ ‘‘నేటినుంచి నా అహంకారాన్నీ, కావ్యంలోని అకారాన్నీ మార్చుకొంటున్నాను’’ అన్నాడు. తర్వాత తన స్వభావాన్ని కూడా మార్చుకున్నాడు.

No comments:
Post a Comment