[హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీలో రెండవ బహుమతి పొందిన కవిత]
పొయ్యిలో రగలాల్సిన. అగ్గి..
పొట్టలో రాజుకుంది.
గుండెల్లో రాకాశి బొగ్గు భగ్గుమన్నప్పుడు.. కలలు కాలిన బూడిద కళ్ళ ముందు రాలింది.
బతుకు చింతయిన చెట్టు మీద రాబందు వచ్చి వాలింది. నీళ్ళలో చేప పిల్ల.. గట్టుమీద పడి గిలగిలా కొట్టుకుంది.
చెట్టుకొమ్మకి పిట్ట గుట్టుగా ఉరేసుకుంది. ఊరు మొత్తం బావురు మంటోన్నప్పుడు బావి గుండె బరువెక్కింది.
వెన్నెల వేడెక్కనుందని తెలిసి నులకమంచం వెక్కివెక్కి ఏడ్చింది. పాడయిపోయే పంటపొలాన్ని చూసి గుండె ఆగిన ముసల్ది.. పాడెక్కి పోయింది.
పిల్లల తల్లిని గొడ్రాలని పిలిచినట్టు పచ్చని నేలని పోరంబోకన్నందుకు.. పంటచేను విలవిలలాడింది.
అక్షయపాత్రను లాగేసుకు బిచ్చం వేస్తామన్నందుకు రైతుచేతి బడితె.. ఆయుధమయ్యింది.
నాలుగేళ్ల పిల్లది... ఝాన్సీరాణవుతుంది మూలనున్న ముసలిది రుద్రమదేవవుతుంది. పంచె బిగించి కదిలిన ప్రతిఒకడూ.. ఒక్కొక్క 'వట్టితాండ్ర' పాపారాయుడే
ఎరుపెక్కిన కళ్ళు భాష్పవాయు గోళాలు ఒళ్ళంతా రబ్బర్ బుల్లెట్ల తూట్లు.. చెవుల్లో కవాతు చేస్తోన్న ఖాకీ బూట్లు.
నేల మాదన్నందుకే శత్రువులయ్యారు వాళ్ళు సమాధుల మీద అభివృద్ధి పునాదులోద్దనందుకే యుద్ధం ప్రకటించారు వీళ్ళు..
నల్లతనం తప్ప నల్లధనం లేని పేదోళ్ళు, పచ్చదనం తప్ప పచ్చనోట్లు లేనోళ్ళు..
సంక్షేమం మరచిపోయి సంక్షోభం సృష్టిస్తూ.. బ్రతుకుల్లో రాలుతోంది.. బూడిద. ధర్మం కోసం పోరులో కారుతోన్నవన్నీ థర్మల్ కన్నీళ్లు...
కాలిపోయిన గుడెసోకటి నిలువునా కూలినట్టే.. రబ్బరు బుల్లెట్ రాకాసికొర తగిలి తెగిన తాళిబోట్టోక్కటి నేలకు రాలినట్టే.. వాడి జీవన ఉద్యానవనాన్ని విద్యుత్ దహనవాటికలో తగలెట్టకు.
పచ్చని ప్లాంట్లన్ని పీకేసి వెచ్చని ప్లాంటొకటి కట్టేసి పల్లెని వల్లకాడు చేయకు.
రూపాయి కోసం ప్రకృతి రూపాన్ని తగలెట్టి ఊరి ఊపిరి తిత్తులలో పొగబెట్టకు
పేదరికం మీద దాడి చేసిన పెద్దరికమేదీ.. పదికాలాల పాటు నిలబడిన దాఖలా లేదు.. నిజం!
***
గరిమెళ్ళ నాగేశ్వర రావు గారి పరిచయం (వారి మాటల్లోనే):
ఉపాధ్యాయునిగా పనిచేస్తూ కొమ్మాడి, విశాకపట్నం లో నివసిస్తున్నాను. నేను ఇప్పటివరకు రాసిన సుమారు రెండువందల యాభై కవితలు, నలబై కథానికలు, ముప్పై వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పటివరకు రచయితగా 49 అవార్డ్స్, ఉపాధ్యాయునిగా ఏడు నేషనల్ అవార్డ్స్ అందుకున్నాను. 2009 లో ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రెసిడెంట్ అవార్డు పొందాను. 2008 లో నా తెలుగు కవితా సంపుటి "ప్రపంచాక్షరి" వెలువడింది. బహుమతి ఇచ్చి ప్రోత్సహించినందుకు హంసినికి కృతజ్ఞతలు.
|
No comments:
Post a Comment