Monday, May 28, 2012

ammaki oka aksharabhishekam


అక్షరాలతో ‘అమ్మ’ను ఆవిష్కరించగలమా?!

  • - గరిమెళ్ళ నాగేశ్వరరావు, 9491804709
  •  
  • 27/05/2012
అమ్మ.. సృష్టిలో ఒక మధురభావన. ఆప్యాయత నిండిన అనుభూతి. అమ్మలో ఏదో తెలీని ఆరాధన ఉంది. అభిమానం ఉంది. ఆర్ద్రత ఉంది. సృష్టిలోనే కాదు, కవిత్వంలోనూ అమ్మది అపురూప స్థానమే. పద్యం... గద్యం... పాట... గేయం ఏదైనా... అమ్మ గురించి రాస్తే అది సూటిగా హృదయాన్ని తాకుతుంది. దేవుడు తాను అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు అంటారు. తెలుగు కవిత్వంలో అనేకమంది కవులు అమ్మకి తమతమ అంతరంగాలలో అంకురించిన భావాలను అక్షరాలుగా మార్చి ప్రేమతో, ఆర్తితో... ఉద్వేగంతో, భక్తితో, గౌరవంతో కవిత్వాభిషేకం చేశారు. పాల్కురికి సోమన, పరమేశ్వరుడి కష్టాలకి కారణం- అతడికి తల్లి లేకపోవడమే అంటూ చెప్పిన పద్యం ‘‘తల్లి కల్గిన నేల తపసిగా నిచ్చు/ తల్లి కల్గిన నేల తల జడల్గట్టు/ తల్లియున్న విషంబు ద్రావనేలిచ్చు/ తల్లి పుచ్చునెసుతువల్ల కాటకిని/ తల్లి అవసరాన్ని లోకానికి చాటుతుంది. గుఱ్ఱం జాషువా- కన్నతల్లి ఖండికలో ‘‘నేనున్ తమ్ముడున్ గలసి నీవు పరున్న సమాధి పెట్టియున్ బూని భుజాల దాల్చితిమి/నీ మానస మోర్చునా జనని మాకు నొకించుక భారమైన/నంభోనిధులెన్ని పెల్లెగసి మ్రోసినవో మముగన్న గడ్పునన్’’ అంటూ తల్లి మనసు తీరుని ఆవిష్కరించడం కంట తడిపెట్టిస్తుంది. శ్రీశ్రీ ‘‘బాటసారి’’లో ‘‘పల్లెటూళ్ళో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది’’ అంటూ కన్న కడుపు తీపిని వర్ణిస్తే... తిలక్ ‘‘అమ్మా నానె్నక్కడికి వెళ్ళాడు’’ అంటూ యుద్ధంలో తండ్రిని కోల్పోయిన కొడుకు చేత అడిగించి... ఆ సమయంలో తల్లి అనుభూతులను అక్షరాలా... మన తలపుల్లో బలంగా నాటడం... అద్భుతమే. ‘‘అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు..’’ సరితూచమంటే సినారె కలం... అమ్మ వేపే ఒరిగి నమస్సులంటుందట.
‘‘ఎవరు రాయగలరూ... అమ్మ అనుమాటకన్న కమ్మని కావ్యం’’ అని సిరివెనె్నల రాగానికి అనురాగాన్ని జతచేసి అమ్మకి అంకితమిస్తే... ‘‘అమ్మా ననునకన్నందుకు/ విప్లవాభినందనాలు/ పక్షుల రాగాలనడుమ/గరిక పూలపాన్పుమీద/ అమ్మా... విప్లవాభినందనాలు/ అంటూ శివసాగర్ పిడికిలి బిగించి, ఉరికొయ్యని ధిక్కరించే సాహసాన్ని తన చనుబాలతో కలిపి తాగించిన అమ్మకి లాల్‌సలాం పలకడం మనం మరిచిపోలేనిది.
శివారెడ్డి యుగయుగాలుగా పవిత్ర దాసిగా మారిపోయిన అమ్మకి, తన మొత్తం శరీరాన్ని రెండు చేతులుగా మార్చి నమస్కరిస్తూ తనని శవంగా కననందుకు/నదిగా కనినందుకు/ కని జనం మధ్యన పారేసినందుకు అనంత కోటి నమస్కారాల నందించడం అపురూపమే. ‘‘సమస్త ప్రపంచాన్నీ నీ అరచేతుల్లోకి తీసుకు/చాచి ఒక్క లెంపకాయ కొట్టు తల్లీ/ అంటూ చేసిన విన్నపం ప్రేమనిండిన కోపమే. నీరెండవేళ కన్నుమూసిన అమ్మని తగలేసి వచ్చి/ పొద్దుగ్రుంకకుండానే రెండో పెళ్ళికి నాన్న లగ్నం పెట్టినప్పుడు రాత్రికి రాత్రే నాన్న కొడుకుగా మరణించి తెల్లారేసరికి అమ్మ కొడుకుగా అవతరించగల తల్లి ప్రేమ- సతీష్‌చందర్ స్వంతం. అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా... అలా... అలా... అలల మీద నడుచుకొంటూ సముద్రం మీదికి వెళ్ళి వెళ్ళి, అక్కడో కన్నీటి సముద్రమై తనని తాను ద్రవీభవించుకోవడం శిఖామణి నేర్చుకున్న విద్య. నడుస్తున్న వంటిల్లులా కన్పించే అమ్మ, చేతులు గరిటెగానో, పెనంగానో మారిపోయి... మండుతోన్న పొయ్యిలా అనిపించినపుడు కదిలిన హృదయంతో ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి/అయినా చివరికి వంటింటి గినె్నలన్నింటిపైనా నాన్న పేరే అంటూ వంటింట్లో బందీ అయిన పులిలా అశాంతిగా తిరిగే అమ్మ బుగ్గలమీద కన్నీటిని తుడిచే ప్రయత్నం అభినందనీయం.
కలత చెందిన కన్నతల్లిని కలంతో లాలిస్తూ వరవరరావు ‘‘అమ్మా నన్నీ మెత్తటి ఊపిరాడని ఉయ్యాలలా ఉన్న ఒడిలోంచి నేలమీద దించు/నీళ్ళల్లో ఒదులు/ నిప్పుల్లో విసురు అని చెబుతూ అమ్మని లాలిపాటగానే తప్ప, జాలిపాటగానో, జోలపాటగానో వినకూడదనడం... ఆలోచింపచేస్తుంది.
యాకూబ్- తన అక్షరయాత్రకి ఆలంబనగా నిల్చిన అమ్మ ప్రేమని మర్లేసుకొంటూ ‘‘అందరి అమ్మల్లాగే, తన తల్లి కూడా పురిటినొప్పులు పడుతూ తనని కన్నా ‘‘కుడిచేతి మీద ముద్దుపెట్టుకొని/లాలనగా నిమిరిందేమో/ బహుశా అందుకే ఈ కవిత్వం అంటూ కన్నతల్లికి కృతజ్ఞతలు చెప్పడం మనసుల్ని కదిలిస్తుంది. తాను పాలుతాగిన రొమ్ముల మీద పాములు కాటేసిన గాట్లను చూసి కదిలిపోయిన ఆశారాజు మృత్యువుని తన కొప్పులో ముడుచుకు నడిచిన అమ్మకి కన్నీళ్ళతో నమస్కరిస్తూ ‘‘అమ్మ నన్ను ఆడిస్తూ... ఆడిస్తూ అలసిపోయి/ నా బాల్యం దగ్గరే నిదురపోయింది’’ అనడం పది కాలాలపాటు గుర్తుండిపోయే అభివ్యక్తి. ‘‘పుట్టిన రోజు రాత్రి, ప్రేమగా ఆహ్వానించిన సహచరి మెత్తని గుండెల మధ్య సజలనేత్రాలతో ముఖం దాచుకొని ‘‘ఈ ఒక్కరోజైనా అమ్మదగ్గర బజ్జుంటే ఎంత బాగుండేదో’’ అనుకొనేంత ప్రేమ ఎండ్లూరి సుధాకర్ కవితలో కనిపిస్తుంది. పంచుకోవడం అన్న ఒక్క మాటతో/పంచలోహ పాత్రల వరుసలో చేరిపోయిన ఐదు ముక్కల అమ్మని ఆర్తిగా చూస్తూ ‘‘చెట్టు పేగు తెంచుకున్నాక/కొమ్మ కొమ్మెలా అవుతుంది/అది ఒట్టి కొయ్యగానీ, అంటూ అడుగంటిపోతోన్న మానవ బంధాలని మందలించగల నైపుణ్యం పాటిబండ్ల రజని వ్యక్తీకరణలో చూడొచ్చు. ఊరందరికీ అయ్య బానిసైతే/ అయ్యక్కూడా బానిసైన అమ్మ/ బానిసకు బానిసగా మారి మాసిపోయిన వరద గుడిలా మారినప్పుడు నెత్తురు కక్కుకొంటోన్న పెన్నుతో... ఆకాశాన్ని చించి అమ్మ ఒంటినిండా కప్పాలన్న ఆవేశం కోయి కోటేశ్వరరావు కవిత్వంలో ధ్వనిస్తుంది. అమ్మ రాసిన ఉత్తరం చదువుతున్నప్పుడు రాంభట్లకు అమ్మ తులసి కోట చుట్టూ తిరుగుతోన్న అడుగుల సవ్వడి విన్పిస్తే... మద్దూరికి వాక్యాల మధ్యన వౌనం అర్థమయ్యి దళితవాడల మీద దౌర్జన్యాలు గుర్తుకొస్తాయ. అడిగోపులకి అమ్మ ప్రాణయంత్రంలా కన్పిస్తే... అల్లం నారాయణకి వంటింటి గడపమీద శిలువబడ్డ అమ్మ కనిపిస్తుంది. కె.వి.కిషోర్ కుమార్‌కి అమ్మ ఇంటి గుమ్మానికి వేలాడే ఇంద్రచాపం అనిపిస్తే... కొండేపూడి నిర్మలకి వలని ప్రేమించే పిట్టలా కనిపిస్తుంది. జంతు స్వభావం అంతం కానిదే/ఆకాశంలో అమ్మ ప్రభావించదు అంటూ ఒమ్మి రమేష్‌బాబు విశ్వసిస్తే... ‘‘భ్రష్టుడా.../ అమ్మ రుణం తీరదు/ అమ్మకి అమ్మవై పుడితే తప్ప అంటూ ఎన్.గోపీ తీర్పు చెప్పడం వైవిధ్య భరితంగా అనిపిస్తుంది.
ఎందరో కవులు అమ్మ మీద తమ ప్రేమనీ, అనురాగాన్నీ, జ్ఞాపకాలనీ, ఆవేదనలనీ ఆవిష్కరించిన తీరు అద్వితీయం. కొంతమందికి అమ్మతో పంచుకున్న మధురజ్ఞాపకాలు గుర్తొచ్చి ఆమె బుగ్గను నిమురుతోన్నట్టు కాగితాన్ని కలంతో నిమురుతూ కవిత్వం రాస్తే... మరికొంతమంది అమ్మ గాయాలనీ, బాధలనీ, కష్టాలనీ, గుర్తుతెచ్చుకుని కలాన్ని కన్నీటితో నింపి అక్షరాభిషేకం చేశారు.
అమ్మ త్యాగాల ప్రతీకగా, గాయాల గేయంగా, వైధవ్యాన్నీ, వివక్షనీ, ఆంక్షలనీ అధిగమిస్తూ లోకం గుండెల్లో శ్లోకంలా కదులుతోంది. ఆకాశాన్ని మొత్తం కెమెరాలో ఎలా బంధించలేమో ‘అమ్మ’ని పూర్తిగా అక్షరాలలో ఆవిష్కరించడం సాధ్యం కాదు. సృష్టి ఉన్నంతవరకూ ఆగని లాలిపాటలా అమ్మ సాగిపోతూంటుంది.

No comments: